: సకల గుణాభిరాముడు, ఏకపత్నీవ్రతుడు శ్రీరాముడు


శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు. సీతాదేవిని తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడని యుగపురుషుడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు. శ్రీరాముడు మంచి భర్తే కాదు... తండ్రి మాట జవదాటని పుత్రుడు కూడా. అందుకే ఆయనకు పితృ వాక్య పరిపాలకుడన్న పేరుంది. తండ్రి దశరథునికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని, పాలనను త్యజించి 14 ఏళ్లు వనవాసం చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తండ్రి మాటను గౌరవించాలే తప్ప, ఎదురు చెప్పకూడదనే నీతిధర్మాన్ని శ్రీరాముడు బోధించాడు. సీతతో వనవాసానికెళుతున్న శ్రీరాముని వెంట సోదరుడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు. భరతునికి రాముడంటే ఎంతో గౌరవం. భక్తిభావంతో సోదరులంతా ఐక్యంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలకు ఆరాధ్యుడు శ్రీరాముడు.

రాముడికి సకల గుణాభిరాముడనే పేరుంది. ఏ కోణం నుంచి చూసినా సద్గుణాలే తప్ప దుర్గుణాలనేవి ఆయనలో మచ్చుకైనా కనిపించవు. పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతునిగా, ప్రజా పరిపాలకుడిగా, సోదరునిగా, తండ్రిగా, యుద్ధవీరునిగా ఖ్యాతి గడించారు. అందుకే ఇప్పటికీ ‘రాముడు మంచి బాలుడు’ అనే మాట వాడుకలో ఉంది. ఎవరైనా మంచి పాలన అందిస్తామనే బదులు గ్రామాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దుతామని అంటారు. రాజకీయ నాయకులు రాముని ఆదర్శాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రాముని పాలన ఎలా సాగిందో వాల్మీకి మహర్షి రామాయణంలో చక్కగా కీర్తించారు. వానర సేనకూ రాముడంటే అపారమైన భక్తిభావం ఉంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సమయంలో సముద్రంలో రామసేతువును నిర్మించి లంకకు దారి చూపింది వానర సేనే. అశోక వనంలో ఉన్న సీతమ్మ జాడ కనుగొన్నది ఆ వానరుడైన హనుమంతుడే. ఇలా రాముడు అందరివాడుగా త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఆదర్శ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే, ఆయనను పూజిస్తూ ప్రతి యేటా... చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.

  • Loading...

More Telugu News