: యువీకి బాలీవుడ్ స్టార్ల మద్దతు
ఐసీసీ టీ20 ఫైనల్స్ లో కప్ చేజారడానికి కారకుడైన యువరాజ్ సింగ్ పై అభిమానులు తీవ్ర విమర్శలు చేయడాన్ని బాలీవుడ్ నటులు ఖండిస్తున్నారు. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, యువ నటుడు వరుణ్ ధావన్, పలువురు యువీకి మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు యువీని తప్పుబట్టిన వారిని ట్విట్టర్లో ఏకిపారేశారు.
'ఓకే.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ ఓడింది. అందుకు అందరం తీవ్రంగా నిరాశ చెందాం. కానీ, ప్రపంచంలోని అన్ని జట్లను ఓడించి భారత జట్టు ఫైనల్లో చేరినందుకు గర్వంగా భావించండి. ఇది మన రోజు కాకపోవచ్చు. బాగా ఆడిన శ్రీలంకకు శుభాకాంక్షలు' అంటూ ముందుగా బిగ్ బీ ట్వీట్ చేశాడు.
ఇక వరుణ్ మాట్లాడుతూ.. యువీ ఇంటిపై రాళ్లు విసరడం చాలా బాధ కలిగించిందన్నాడు. ఇది చాలా మూర్ఖుల పనని, అవగాహన లేని వారే ఇలా చేస్తారన్నాడు. యువీ చాలా నిజాయతీ క్రీడాకారుడని, అతని వల్ల వరల్డ్ కప్ గెలిచామన్నది గుర్తు పెట్టుకోవాలన్నాడు. క్యాన్సర్ తో బాధపడుతూనే యువీ జట్టును గెలిపించి అందరికీ సంతోషాన్ని పంచాడని, దాన్నెలా మర్చిపోతారని వరుణ్ ప్రశ్నించాడు. ఆటంటే కొన్నిసార్లు ఓడిపోవచ్చని, కొన్నిసార్లు గెలవచ్చని అంత దానికే ఇలా ప్రవర్తించడం దారుణమని అన్నాడు. ఇంకా బాలీవుడ్ కు చెందిన పలువురు యువీకి తమ మద్దతు తెలిపారు.