: మోడీ ప్రధాని అవుతాడేమో అని అమెరికా భయపడుతోంది: శివసేన


బీజేపీ నేత నరేంద్ర మోడీ భారత ప్రధాని అవుతాడేమోనని అమెరికా భయపడుతోందని శివసేన తన పత్రిక సామ్నాలో తెలిపింది. పిల్లిలా ఉన్న భారత్ పులిలా మారుతుందేమోనని అగ్రరాజ్యం భయపడుతోందని పేర్కొంది. అందుకే... మోడీ ప్రధాని అయితే భారత్ లోని ముస్లింలు అణచివేతకు గురవుతారని ఇటీవల కాలంలో అమెరికా అభిప్రాయపడిందని ఆరోపించింది. భారతదేశ ఎన్నికలు, రాజకీయాలలో తలదూర్చడానికి అమెరికాకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది.

ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ లలోని ముస్లింలను అమెరికా ఊచకోత కోసిందని... దీనిపై మాత్రం ఆ దేశానికి ఏ మాత్రం బాధ ఉండదని విమర్శించింది. 9/11 దాడుల తర్వాత అమెరికాలోని ముస్లింలపై ఆ దేశంలోని వివిధ ఇంటలిజెన్స్ విభాగాలు నిఘా ఉంచాయని... దీంతో అక్కడి ముస్లింలు నరకయాతనకు గురవుతున్నారని ఆరోపించింది. మన దేశానికి చెందిన ముస్లిం సెలబ్రిటీలైన షారుక్ లాంటి వారిని కూడా అమెరికా విమానాశ్రయాల్లో గంటల తరబడి వేచియుండేలా చేశారని మండిపడింది.

భారత్ లోని ముస్లింలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని... అంతర్జాతీయ పోలీసు పాత్ర పోషిస్తున్న అమెరికాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. మోడీ భారత ప్రధాని అయితే తమ ఆధిపత్యానికి తెరపడుతుందనే ఆందోళనలో అమెరికా ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News