: పటిష్ఠమైన భద్రత మధ్య జరుగుతున్న తొలి దశ పోలింగ్
తొలి దశ సార్వత్రిక ఎన్నికలు పటిష్ఠ భద్రత మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. అసోంలోని ఐదు నియోజకవర్గాల్లో, త్రిపురలోని త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అసోంలోని తేజ్ పూర్, దిబ్రూగఢ్, కోలియాబోర్, జోర్హాట్, లంఖింపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 51 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో 64,41,634 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఉదయం 10 గంటలలోపే 25 శాతం ఓటింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, ఆయన కుమారుడు కోలియాబోర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల సిబ్బంది వాటి స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. అసోంలో ఎండలు మండిపోతుండడంతో మధ్యాహ్నానికి పోలింగ్ శాతం కాస్త నెమ్మదించింది. సాయంత్రానికి ఊపందుకుంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.