: అందరి దృష్టి మల్కాజిగిరి మీదే... ఎందుకట?


రాష్ట్రంలోని లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం గత కొన్ని రోజులుగా అందరి నోళ్లలో నానుతొంది. రాజకీయ నేతలంతా మల్కాజిగిరి నుంచి 'నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తా'నంటూ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఈ స్థానం టీడీపీలో వివాదాన్ని రేపింది కూడా. అసలు మల్కాజిగిరికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు అందరూ మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు?.

మల్కాజిగిరి నియోజకవర్గం దేశంలోని అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి. పట్టణ, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువమంది ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. మల్కాజిగిరి నియోజకవర్గంలో విద్యాధికులు కూడా ఎక్కువే. అదీ కాక ఇక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదు శివారు ప్రాంతమైన మల్కాజిగిరిలో 70 శాతం మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారే కావడం విశేషం.

మల్కాజిగిరి పరిధిలో మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ క్రీష్టియన్లు, దళిత ఓట్లతో పాటు, సీమాంధ్ర ఓట్లు అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తాయి. మరో వైపు రెడ్డి, కమ్మ వర్గీయులు 20 శాతం మంది ఉండగా, బ్రాహ్మణులు 80 వేల మంది ఉన్నారు. వీళ్లు ప్రధానంగా మల్కాజిగిరి, కూకట్ పల్లి, ఎల్ బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నారు. దళితులు, క్రీష్టియన్లు సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ఉన్నారు. ముస్లిం ఓటర్లు కూడా 50 శాతం మంది ఉన్నారు.

దీంతో తెలంగాణ ఉద్యమంతో పెద్దగా సంబంధాలు లేని వాళ్లు ఇక్కడి గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సీమాంధ్ర నేతలతో సత్సంబంధాలు కలిగిన వారు మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. దీంతో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఇండిపెండెంట్ గాను, లోక్ సత్తా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఆశావహులు బరిలో నిలిచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో మల్కాజిగిరి స్థానానికి మంచి డిమాండ్ ఏర్పడింది.

  • Loading...

More Telugu News