: ఐపీఎల్ లో 'పాంచ్' పటాకా!
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి ఐపీఎల్ మరికొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. బౌండరీలే హద్దుగా విరుచుకుపడే బ్యాట్స్ మన్, పరుగులకు అడ్డుకట్ట వేయడమెలాగా అని ఆలోచించే బౌలర్లు.. పాదరసంలా జారిపోయే ఫీల్డర్లతో ఐపీఎల్ ఆరవ సీజన్ కూడా ఆకట్టుకుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే, పిచ్ ఎలాగున్నా, బౌలర్ ఎవరైనా లక్ష్య పెట్టని ఓ ఐదుగురు ఆటగాళ్ళు అందరి దృష్టిని తమమీదకు మరల్చుకోవడం ఖాయం.
విండీస్ సునామీ క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్), భారత పరుగుల యంత్రం సురేశ్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్ ), సఫారీ స్టార్ ఏబీ డివిల్లీర్స్ (రాయల్ చాలెంజర్స్), దక్షిణాఫ్రికా తాజా సంచలనం క్వింటన్ డి కాక్ (సన్ రైజర్స్), కోల్ కతా నైట్ రైడర్స్ సారథి గౌతమ్ గంభీర్ లు తాజా ఐపీఎల్ సీజన్ లో ఎలా ఆడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
సిసలైన విధ్వంసానికి పర్యాయపదంలా బాసిల్లే గేల్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, బంతిని బలంగా స్టాండ్స్ లోకి మోదడంలో ఇతని తర్వాతే ఎవరైనా. విచిత్రమైన స్టాన్స్, నమ్మశక్యం కాని రీతిలో టైమింగ్, అమేయ భుజబలం, అన్నింటికి మించి పరిస్థితికి అనుకూలంగా ఆటతీరు మలుచుకోవడం ఈ కారీబియన్ క్రికెటర్ కు మేలిమి ఆభరణాలు.
ఇక మరో ఎడమచేతి వాటం ఆటగాడు సురేశ్ రైనా అలుపన్నది ఎరుగకుండా నిరంతరం పరుగులు తీయడంలో నేర్పరి. సునిశితమైన టైమింగ్ తో బంతిని బాదడమే కాదు, సింగిల్ కు వీల్లేని చోట కూడా రెండు పరుగులు సాధించడం ఈ యువ బ్యాట్స్ మన్ కు వెన్నతో పెట్టిన విద్య. కోల్ కతా నైట్ రైడర్స్ సారథి గంభీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి నాలుగు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టను ఐదో సీజన్ లో విజేతగా నిలపడంలో గౌతీ సామర్థ్యం స్పష్టమైంది.
ఈసారి కూడా గౌతీ ప్రదర్శన మీదే కోల్ కతా యజమాని షారూక్ నమ్మకం పెట్టుకున్నాడు. కాగా, ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఏబీ డివిల్లీర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఉపయుక్తమైన ఇన్నింగ్స్ లాడాలని ఆ జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. వికెట్ల వెనుకాల బౌలర్లకు దన్నుగా ఉండడమే కాదు, బ్యాటింగ్ కు దిగాడంటే పరుగుల మోత మోగాల్సిందే.
ఇక, తాజాగా క్రికెట్ వర్గాల్లో తరచు వినిపిస్తున్న పేరు క్వింటన్ డి కాక్. దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 క్రికెట్లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తోన్న ఈ 20 ఏళ్ళ నవ యువకుడు ఈసారి హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్ సంగక్కర స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు తలకెత్తుకోనున్నాడీ యువ కిశోరం.