: ఈ సిగ్నల్ మలేసియా విమానం పంపిందేనా?
మార్చి 8న అదృశ్యమైన మలేసియా విమానం ఆచూకీ కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన 13 విమానాలు, 11 పడవలు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఈ గాలింపులో ప్రత్యేకంగా అమెరికాకు చెందిన సోనార్ సెన్సర్ ఉన్న సబ్ మెరీన్ పాలుపంచుకుంటోంది. కాగా చైనాకి చెందిన హైగ్జూన్ 01 అనే పెట్రోలింగ్ పడవకి హిందూమహాసముద్ర జలాల్లోంచి సెకెనుకు 37.5 కిలో హెర్జ్ ల ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ వచ్చింది.
మలేసియా విమానం ఎంహెచ్ 370లో బ్లాక్ బాక్స్ తయారు చేసిన డుకానె సీకామ్ సంస్థ ఈ సిగ్నల్ ఆ విమానం నుంచి వెలువడే సిగ్నల్ కి దగ్గరగా ఉందని నిర్థారించింది. గత 28 రోజుల గాలింపులో లభించిన అతి ముఖ్యమైన సూచన ఇదే. మరో వైపు బ్లాక్ బాక్స్ లో ఛార్జింగ్ మరి కొద్ది గంటల్లో పూర్తయిపోతుంది. ఈ దశలో సిగ్నల్ వచ్చింది. ఛార్జింగ్ పూర్తయ్యేలోపే బ్లాక్ బాక్స్ ను గుర్తించగలరా? అనే సందేహం నిపుణుల్లో కనిపిస్తొంది.
బ్లాక్ బాక్స్ ను గుర్తించగలిగితే విమానంలో ఏం జరిగింది?, ఎందుకు కుప్పకూలింది? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. లేని పక్షంలో మలేసియా విమానం అంతర్థానం చరిత్రలో అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోతుంది.