: పురుషుల కంటే అతివలే మిన్నట
భోజ్యేషు మాత, కరణేషు మంత్రి.. అంటూ స్త్రీల గుణగణాల గురించి విని ఉన్నాం. అయితే, ఈ ఉపమానాలు అన్నీ ఇంటికి పరిమితమైన గృహిణుల గురించే. ఇవన్నీ, పురాణ కాలంలో భర్తను ఎన్ని రకాలుగా, ఎలా సేవించుకోవాలో తెలిపేవే. అయితే, నేటితరం మహిళ.. పురుషులకు దీటుగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ఓ కెనడా వర్శిటీ చేసిన అధ్యయనం గురించి తెలుసుకోవాల్సిందే.
కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్శిటీ 600 మంది కంపెనీ బోర్డు డైరక్టర్లపై ఈ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం పురుషుల కంటే మహిళలే కార్పొరేట్ కంపెనీల వ్యాపారాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడతారని తెలుస్తోంది. వ్యాపార రంగంలో మహిళలు.. పురుషుల కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకోగలరని ఈ అధ్యయనం చెబుతోంది.
మహిళలు నిర్ణయాలు తీసుకునే సమయంలో నిబంధనలు పాటించడం, సహచరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటివి కచ్చితంగా అనుసరిస్తారని సర్వే వెల్లడించింది. దీంతో, కార్పొరేట్ కంపెనీలు లాభాల బాటలో పయనించేందుకు మహిళల శక్తియుక్తులు ఎంతగానో ఉపయోగపడతాయని మెక్ మాస్టర్ వర్శిటీలో స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ విభాగం ప్రొఫెసర్ క్రిస్ బార్ట్ అంటున్నారు. మహిళలు తమకు అప్పగించిన పనులను సరిగ్గా నిర్వర్తించడమే కాకుండా, చురుగ్గా పూర్తి చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.