: హీరోయిన్ దొరకక అబ్బాయికే హీరోయిన్ వేషమేద్దామనుకున్నా: సంపూ
'హృదయ కాలేయం' ఫేం సంపూర్ణేష్ బాబు తన సినిమా కష్టాలను ఏకరవుపెట్టాడు. హైదరాబాదులో ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనతో సినిమా చేసేందుకు నిర్మాత, దర్శకుడు, కథ అన్నీ సిద్ధమైపోయినా హీరోయిన్ దొరకలేదని అన్నాడు. తన పక్కన హీరోయిన్ గా నటించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, హీరోయిన్ వేషం వేసే అమ్మాయి కోసం మూడు నెలల పాటు ఎదురు చూశామని తెలిపాడు.
మూడు నెలలపాటు వెతికి, ఓపిక నశించి... చివరకు అబ్బాయికే అమ్మాయి వేషం వేయించి సినిమా పూర్తి చేద్దామని అనుకుంటుండగా, హీరోయిన్ దొరికిందని ఈ సంచలన హీరో తెలిపాడు. ఇప్పుడు ప్రేక్షకులు తన సినిమాను ఆదరిస్తుండడంతో తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్టైందని సంపూర్ణేష్ బాబు హర్షం వ్యక్తం చేశాడు.