: బాబు, జగన్ కోరడం వల్లే విభజన జరిగింది: రోడ్ షోలో కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ, వైఎస్సార్సీపీ లేఖలు ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా నాగులుప్పాడు రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలాగే జగన్ కూడా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని డిమాండ్ చేశారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్న తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసినా అధిష్ఠానం విభజన చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల పట్ల ఢిల్లీ పెద్దలకు చిన్న చూపు ఉందని, దీనిని ప్రతిఘటించాలంటే ప్రతి తెలుగు వారు జై సమైక్యాంధ్ర పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.