: లావుగా ఉన్నావు... పెళ్లి చేసుకోవాలంటే ఇంకో రూ.3 లక్షలు కావాలి!
పెళ్లి నిశ్చయమైంది. మాట్లాడుకున్న ప్రకారం, కొన్ని కట్న కానుకలు కూడా ముట్టజెప్పారు. తీరా పెళ్లి ముహూర్తం సమీపించిన తర్వాత ‘‘నువ్వు లావుగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోను’’ అంటూ పెళ్లికొడుకు పెళ్లి కూతురుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు.
భాదితుల కథనం ప్రకారం... విజయవాడలోని మాచవరంలో ఉంటున్న యువతికి హైదరాబాదు కూకట్ పల్లికి చెందిన పాలెం విక్రమ నాయుడుతో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 6న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మే 12వ తేదీన పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. కట్నకానుకల కింద రూ. 5 లక్షలు ఇచ్చేందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. నిశ్చితార్థం రోజున రూ. 2 లక్షలు ముట్టజెప్పారు.
ఈ క్రమంలో ఇటీవల పెళ్లికొడుకు కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘‘నువ్వు లావుగా ఉన్నావు. వెంటనే బరువు తగ్గాలి. లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఒకవేళ పెళ్లి జరగాలంటే మరో రూ. 3 లక్షలు అదనంగా ఇవ్వాలి’’ అంటూ షరతు విధించాడు. దీంతో బిత్తరపోయిన ఆ యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. మోసపోయామని గ్రహించిన ఆమె తల్లిదండ్రులు మాచవరం పోలీసులను ఆశ్రయించారు.