: దేశ విభజన నాటి నుంచే గుజరాత్ తో అనుబంధం వుంది: అద్వానీ
గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేయకూడదని తాను అనుకోలేదని బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తెలిపారు. నామినేషన్ వేయడానికి గాంధీనగర్ వెళుతున్న అద్వానీని అహ్మదాబాద్ లో విలేకరులు ఇటీవలి వివాదంపై ప్రశ్నలు కురిపించారు. మోడీతో విభేదాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి పోటీ చేయడానికి అద్వానీ ఆసక్తి చూపడం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన గాంధీనగర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీనిపై మాట్లాడుతూ.. గుజరాత్ తో, గాంధీ నగర్ ప్రజలతో ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే తనకు అనుబంధం ఏర్పడలేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానంతరం దేశ విభజన సమయంలోనే గుజరాత్ తో అనుబంధం ఏర్పడిందని ఆయన చెప్పారు. భోపాల్ నుంచి పోటీచేయాలని మధ్యప్రదేశ్ నాయకులు గట్టిగా కోరడం వల్లే అక్కడ పోటీ చేయాలనుకున్నట్లు తెలిపారు. అద్వానీ పాక్ లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం గుజరాత్ కు వచ్చి స్థిరపడింది.