: అల్లాంటిల్లాంటి ఊరు కాదిది..!


భారత దేశ భవితవ్యం గ్రామాలతోనే ముడిపడి వుంది... ఇది పలువురు రాజకీయ నాయకులు మైకు దొరికినప్పుడల్లా చెప్పే రొటీన్ డైలాగ్. మంత్రిత్వ శాఖలు, అధికార గణాలదీ అదే మాట. పట్టణాలతో పోలిస్తే బాగా వెనుకబడిన ప్రాంతాలనే గ్రామాలని పిలుస్తారని చిన్నారులతో పాటు చరిత్ర కారులకు ఓ గట్టి నమ్మకం. అయితే, వారి నమ్మకాన్ని వమ్ముచేసేలా ఓ గ్రామం సకల సౌకర్యాలతో పట్టణాలకే కన్నుకుట్టేలా ఉందంటే అది అల్లాంటిల్లాంటి ఊరు అయి ఉండదు మరి.

ఇంతకీ ఆ పల్లె ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్ లోనే వరంగల్ జిల్లాలో ఉంది. ఆ ఆదర్శ గ్రామం పేరు గంగదేవిపల్లి. సాధారణంగా మనకు పల్లెల్లో స్వాగతం చెప్పే పారిశుధ్య లేమి, గతుకుల రోడ్లు, శిథిలావస్థలో పాఠశాలలు, అస్తవ్యస్తమైన బడుగు బతుకులు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. నిరంతర నీటి సరఫరా, మెరుగైన విద్యుత్ పంపిణీ విధానం, శాస్త్రీయ జల శుద్ధి కేంద్రం, కాంక్రీట్ నివాసాలు, సిమెంట్ రోడ్లు, సామాజిక కేబుల్ టీవీ వ్యవస్థ.. వంటి నూతన తరం సౌకర్యాలు గంగదేవిపల్లి సొంతం.

ఇక్కడి ప్రజలు తమకు తామే లక్ష్యాలు నిర్ధేశించుకుని వాటి కోసం సమష్టిగా శ్రమిస్తారు. ఊరు జనాభా కేవలం 1300 అయినా, నూటికి నూరు శాతం వయోజన అక్షరాస్యత సాధించింది. 2000 సంవత్సరం నుంచి స్కూల్ డ్రాపౌట్ల శాతం సున్నాగా నమోదవుతూ వస్తోందంటే, ఈ ఊరిలో సామాజిక చైతన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఇంత చిన్న గ్రామంలో రెండు డజన్ల కమిటీలున్నాయి. ఊరి బాగోగులు పర్యవేక్షించడమే వాటి పని.

ప్రస్తుతం 35 ఏళ్ళ లోపు వివాహితులెవ్వరికీ ఇద్దరికి మించి సంతానం ఉండదు. అంత కచ్చితంగా కుటుంబ నియంత్రణ పాటిస్తారు. నవజాత శిశువులు నూటికి నూరు శాతం ఇక్కడ ఆరోగ్యంగా పెరుగుతారు. వారికి ఎప్పటికప్పుడు టీకాలు వేయించడంలో గ్రామ వైద్య కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ప్రతి మహిళ ఏదో ఒక స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై  ఉంటుంది.

ఇన్ని విశిష్టతలున్న ఈ గ్రామం ఇప్పుడు ఓ పర్యాటక స్థలంలా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడికొచ్చే పర్యాటకులకు గ్రామ వివరాలు అందించడానికి కొందరు గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. ఆనోటా ఈనోటా పడి గంగదేవిపల్లి ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. త్వరలోనే ఈ ఊరి పెద్ద తమ గ్రామ ప్రత్యేకత వివరించడానికి నేపాల్ వెళ్ళనుండడమే ఇందుకు నిదర్శనం. 

  • Loading...

More Telugu News