: నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ24
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్షకేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ24 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ ప్రయోగంతో, భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 'ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్)-1బీని' పీఎస్ఎల్వీ వాహకనౌక అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహంతో భారతీయ నేవిగేషన్ వ్యవస్థ అత్యంత యాక్యురసీ లెవెల్ (కచ్చితత్వం) కు వెళుతుంది. ఇది భారత రక్షణ రంగానికి ఎన్నో సేవలు అందించనుంది. శత్రువుల కదలికలతో పాటు విమాన, నౌకల కదలికలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఈ ఉపగ్రహం పసిగడుతుంది. నేవిగేషన్ సిస్టంకు సంబంధించి ఈ సిరీస్ లో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఈ నాటి ప్రయోగంతో ఈ సిరీస్ లో రెండో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రయోగం విజయవంతమయితే అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరప్ ల సరసన భారత్ నిలుస్తుంది.