: సోనియాగాంధీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: నరేంద్ర మోడీ
తమ ఓట్లు చీలిపోకుండా చూడాలని ముస్లిం నాయకులకు పిలుపునిచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ‘వికృతమైన మతతత్వానికి’ పాల్పడుతున్నారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సోనియాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జమా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారితో సోనియా సమావేశమై అక్కడే ఈ మేరకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఘజియాబాద్ లో మోడీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ఓటమిని పసిగట్టింది. అందుకే, తన నినాదాన్ని లౌకికవాదం నుంచి వికృతమైన మతతత్వానికి మార్చుకుంది’’ అని ఆయన విమర్శించారు. ‘‘నిన్న సోనియా ఏం చెప్పారో... ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మతతత్వం ప్రాతిపదికన ఓట్లు అడగటం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం’’ అని మోడీ అన్నారు.