: హై సెక్యూరిటీ జైలు గోడ ఎలా కూలింది?
పంజాబ్ లోని అత్యంత సురక్షితమైన జైలుగా భావించే హైసెక్యూరిటీ జైలు గోడ దానంతట అదే కుప్పకూలిపోయింది. 200 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు, మూడడుగుల మందం ఉన్న ఈ గోడ ఎలా కూలిపోయిందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ జైలులో 50 మంది కరడుగట్టిన ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు. అకస్మాత్తుగా గోడ కూలిపోవడంతో 33 మంది తీవ్రవాదులను హుటాహుటిన సంగ్రూర్ లోని వేరే జైలుకు తరలించారు.
17 మందిని నేటి సాయంత్రం తరలించనున్నారు. ఈ జైలులో మొత్తం 498 మంది ఖైదీలున్నారు. దశల వారిగా వారిని కూడా అధికారులు తరలించనున్నారు. గోడ 90 ఏళ్ల నాటిది కావడంతో పాతబడి కూలిపోయి ఉంటుందని, ఇందులో కుట్ర కోణం లేదని అధికారులంటుండగా... అదే నిజమైతే ఎర్రకోట, చార్మినార్, కుతుబ్ మీనార్లు ఎప్పుడో కూలిపోయి ఉండాలని విపక్షం అంటోంది.