: కల్లు కోసం లొల్లి... ఐదుగురి మృతి
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇజ్జలూరులో కల్లు గీసుకునే చెట్ల మీద హక్కు కోసం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గిరిజనులు మరణించారు. గిరిజన గ్రామమైన ఇజ్జలూరులో ఈడిగ కల్లు చెట్లకు సంబంధించి అక్కడి వారికి గత నాలుగైదు రోజులుగా వివాదం నెలకొంది. మద్యం మత్తులో ఉండటంతో రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ గొడవ జరిగింది.
ఈ గొడవలో రెండు వర్గాలకు చెందిన వాళ్లు కత్తులతో పరస్సరం దాడులు చేసుకున్నారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా ఒక్కో చెట్టు నుంచి 50-100 లీటర్ల వరకు కల్లు వస్తుంది. ఇది రంపచోడవరం మార్కెట్లో లీటరుకు 15 రూపాయల చొప్పున విక్రయిస్తారు. వేసవి కాలం కావడంతో ఈ కల్లుకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ కల్లు కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది.