: దోపిడీ చేయడం నేర్పింది వైఎస్సే: పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో దోచుకోవడమనేది సాధారణ విషయమని ఆరోపించారు. ఏ స్థాయిలోనైనా దోపిడీకీ పాల్పడవచ్చని నేర్పింది వైఎస్సే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేనూ సమాజాన్ని దోచుకోవచ్చు అనే ఆలోచన చోటామోటా గల్లీ నాయకులను కూడా కలిగింది వైఎస్ హయాంలోనే అని విమర్శించారు. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజశేఖర రెడ్డి పచ్చి అవకాశవాదని పవన్ ఆరోపించారు. ఆయన అవకాశవాదం, అంతులేని దోపిడీ వల్లే తెలంగాణ ఉద్యమం బలపడిందని విమర్శించారు. వేలాది కోట్ల రూపాయలను అడ్డూ అదుపూ లేకుండా కొల్లగొడుతుంటే... తెలంగాణ ప్రజల మనసులోని ఆవేదన ఆగ్రహంగా మారి ఉద్యమానికి ఊతమిచ్చేలా మారిందని చెప్పారు. ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత నంద్యాల వెళ్లి... మనం హైదరాబాదుకు వెళ్లాలంటే వీసాలు తీసుకోవాల్సి ఉంటుందని అక్కడి ప్రజలను రెచ్చగొట్టారని తెలిపారు. విభజన జరిగితే వేరే దేశమైపోతుందా? అని పవన్ ప్రశ్నించారు. ఇలా చేస్తే... వైఎస్ కు వేర్పాటు వాదులకు ఏమైనా తేడా ఉందా? అంటూ ఎద్దేవా చేశారు.