: 'హ్యారీపోటర్' తరహాలో అదృశ్యం!
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్లు వాస్తవరూపం దాల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. ముఖ్యంగా ఆమధ్య వచ్చిన 'హ్యారీపోటర్' సినిమాలోలా అదృశ్యవస్త్రం త్వరలో రానుంది. ఇలాంటి వస్త్రం (మాంట్లే క్లాక్) తయారీలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. కాంతి తరంగాల పరిధిలో నిర్దేశిత ప్రాంతంలో వస్తువులు కనిపించకుండా చేయగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.
ఏదైనా వస్తువుపై ఈ వస్త్రాన్ని కప్పితే ... ఆ వస్తువు అదృశ్యమైన భావన మనకు కలుగుతుంది. అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిని కనుగొన్నారు. అయితే, ఇది పరిమిత ప్రాంతంలో కాంతి కిరణాలకు లోబడే పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఓ సిలిండర్ పై ఈ వస్త్రాన్ని కప్పగా ... సూక్ష్మ తరంగ డిటెక్టర్లు దానిని గుర్తించలేకపోయాయి. మానవులు కూడా పసిగట్టలేని పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.