: టీడీపీ తెలంగాణ మేనిఫెస్టో వివరాలు...
"తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలు అత్యున్నతమైనవి. అమరుల కుటుంబాలను టీడీపీ ఆదుకుంటుంది. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందిస్తాం. బీసీని సీఎం పీఠంపై కూర్చోబెడతాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మార్కెట్ చేయడం ద్వారా మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకురావడం... ఉద్యోగాల కల్పన". తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టోలో టీడీపీ ప్రధానంగా దృష్టి సారించిన అంశాలు ఇవి. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు...
* పదేళ్లలో 50 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన.
* తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.
* తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.
* వరంగల్ ను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడం. ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహం.
* ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.
* నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వారం రోజుల్లో పొందేందుకు సింగిల్ విండో విధానం అమలు. బ్యాంకుల నుండి సత్వర రుణం పొందేలా చర్యలు.
* కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ మరమ్మతుల కేంద్రం ఏర్పాటు.
* రామగుండం, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలలో విమానాశ్రయాల నిర్మాణం.
* తెలంగాణ జిల్లాలలోని వనరులను ఆధారంగా చేసుకుని వివిధ పరిశ్రమల ఏర్పాటు.
* కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పత్తి ఆధారిత పరిశ్రమలు. వరి, సోయా, మొక్కజొన్న మొదలైన పంటల ప్రాసెసింగ్ పరిశ్రమలు.
* ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ.
* హైదరాబాదులో సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివృద్ధి.
* హైదరాబాద్ నుంచి సీమాంధ్ర కొత్త రాజధానికి, తెలంగాణలోని వివిధ పట్టణాలకు వేగవంతమైన రైల్వే ఏర్పాటు.
* అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులు, బుల్లెట్ రైళ్లు.
* భద్రాచలం, మేడారం, వేములవాడ, యాదగిరిగుట్ట, బాసర, ఏడుపాయలు, అలంపూర్, దేవరకొండ, ధర్మపురి, వనపర్తి తదితర పుణ్యక్షేత్రాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయడం.
* సిరిసిల్లను ప్రత్యేక యూనిట్ గా ప్రకటించి... చేనేత కార్మికులకు చేయూతనివ్వడం.
* గద్వాల, బచ్చన్నపేట, సిరిసిల్ల, పోచంపల్లి, ఘన్ పూర్, రాజోలి, నారాయణపేట, రఘుపతిపేట, హుజూరాబాద్, పుట్టపాక ప్రాంతాల్లో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు.
* ఎల్లంపల్లి, దేవాదుల సహా అన్ని ప్రాజెక్టులను ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వచ్చేలా చేయడం.
* ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కోసం కృషి. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం.
* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సత్వరమే ఏర్పాటు. ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపొందించడం.
* పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం. పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టడీ సర్కిళ్లు.
* ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత బస్ పాసులు. ప్రతి జిల్లా కేంద్రంలో వ్యాయామ విద్య, క్రీడల కళాశాలల ఏర్పాటు.
* విశ్రాంత ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పింఛన్ సవరింపు.
* ఉద్యోగులకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీల పెంపు. ఎన్టీఆర్ ఆరోగ్య కార్డుల పథకం ద్వారా రూ. 2.50 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం.
* పద్మశాలీలను బీసీ-బి నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు కృషి. బోయ కులస్తులను ఎస్టీలుగా మార్చేందుకు చర్యలు.
* బీసీ డిక్లరేషన్ ప్రకారం 100 సీట్ల కేటాయింపు. వెనుకబడిన వర్గాలకు రూ. 10 వేల కోట్ల బడ్జెట్.
* ఆదాయం లేని మసీదుల ఇమాంలకు నెలకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు గౌరవ వేతనం. మసీదుల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం.
* బెత్లెహామ్ వెళ్లే క్రీస్టియన్లకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు.
* గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న వారి రక్షణకు చర్యలు.
* సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారికి 75 శాతం వరకు రాయితీ.
* లారీ, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 5 లక్షల వరకు బీమా.
* రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు రూ. 1000 కోట్లతో 'మార్కెట్ జోక్యం నిధి'.