: టీడీపీ సీమాంధ్ర మేనిఫెస్టో వివరాలు...
"సీమాంధ్రను నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. వికేంద్రీకరణ ఫార్ములాతో అన్ని ప్రాంతాలను అభివృద్ధిపథంలో దూసుకుపోయేలా చేయాలి. సర్వహంగులతో, అందరికీ అనువుగా ఉండే రాజధానిని నిర్మించాలి". సీమాంధ్ర మేనిఫెస్టోలో ఏపీటీడీపీ ప్రధానంగా దృష్టి సారించిన అంశాలు ఇవి. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే...
* విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్.
* సీమాంధ్రలో అన్ని జిల్లాలను కనెక్ట్ చేస్తూ ర్యాపిడ్ రైల్ వ్యవస్థ.
* కళింగపట్నం, నర్సాపురం, నిజాంపట్నం, రామాయపట్నం, దుగ్గరాజు పట్నం సహా ప్రతి జిల్లాలో పోర్టుల నిర్మాణం. వీటికి అనుసంధానిస్తూ పారిశ్రామిక క్లస్టర్లు.
* పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రహదారి నిర్మాణం. జలరవాణాకు ప్రాధాన్యం.
* విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. పుట్టపర్తి, కడప, రాజమండ్రి విమానాశ్రయాల్లో రాత్రి పూట కూడా విమానాలు దిగేలా సకల సౌకర్యాల కల్పన.
* ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం.
* కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సిమెంట్, స్టీల్ పరిశ్రమలు.
* కృష్ణా జిల్లాను ఆటోమొబైల్ హబ్ గా మార్చడం. ప్రకాశం జిల్లాను గ్రానైట్ హబ్ గా, పశ్చిమగోదావరి జిల్లాను ఆక్వా హబ్ గా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను మాన్యుఫాక్చరింగ్ హబ్ లుగా తీర్చిదిద్దడం.
* శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మత్స్య, వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి. ఎగుమతులు, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు.
* ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాయలసీమ జిల్లాల్లో ఎలక్ట్రానిక్, ఫార్మసీ కంపెనీల ఏర్పాటు.
* బెంగుళూరు-హైదరాబాద్ కు అనుసంధానంగా అనంతపురం-కర్నూలు ఐటీ కారిడార్ ఏర్పాటు.
* ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధి.
* కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను టెక్స్ టైల్ పరిశ్రమల కారిడార్ గా అభివృద్ధి చేయడం.
* ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు, పత్తి ఆధారిత కంపెనీల ఏర్పాటు. ఇంజినీరింగ్, ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధి.
* తిరుపతి, కాణిపాకం, లేపాక్షి, మహానంది, అహోబిలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మంగళగిరి, విజయవాడ, అన్నవరం, సింహాచలంలను కలుపుతూ ప్రత్యేక పిలిగ్రిం కారిడార్.
* కొత్త రాష్ట్రంలో నూతన రైల్వే జోన్ ఏర్పాటు. కొత్త రాజధానికి, హైదరాబాదుకు మధ్య సత్వర రైల్వే వ్యవస్థ.
* పులికాట్, కొల్లేరు, విశాఖ, హార్స్ లీ హిల్స్, పాపికొండలు, బొర్రా గుహలు, వివిధ బౌద్ధ క్షేత్రాలను టూరిజం పరంగా మరింత అభివృద్ధి పరచడం.
* కోస్తా ప్రాంతంలోని సహజవాయువు ఆధారంగా విద్యుత్ పరిశ్రమలు.
* యూనివర్శిటీలు, పరిశ్రమలకు అనుబంధంగా ఇన్నొవేషన్ క్లస్టర్ల ఏర్పాటు.
* కాపు కులస్తుల కోసం గతంలో విడుదల చేసిన డిక్లరేషన్ అమలుకు కృషి. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేసేందుకు యత్నం.
* పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు. శివార్చకులకు బీసీ-డి కింద గుర్తింపు.
* బీసీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్.
* బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై పోరాటం. రాష్ట్రానికి న్యాయబద్దంగా రావాల్సిన కృష్ణా మిగులు జలాల వాటా సాధన.
* దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అనువైన వాతావరణం కల్పన.
* మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ. ఆపదలో ఉన్న మహిళలకు 5 నిమిషాల్లో సాయం.
* వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పింఛను. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు.
* పేదలందరికీ లక్షన్నర రూపాయలతో ఉచిత గృహం.
* పరిశ్రమలు, ఇళ్లకు నిరంతర విద్యుత్. సేద్యానికి 9 గంటల విద్యుత్. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ.
* కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. కళాశాల విద్యార్థులకు ఐప్యాడ్లు.
* ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి, పట్టణానికి రక్షిత మంచినీరు.
* ఫుట్ పాత్ విక్రయదారులు, పేపర్ బాయ్స్, పాల సరఫరాదారులు ద్విచక్ర వాహణం కొనుక్కునేందుకు వడ్డీ లేని రుణం.
* ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్ట నివారణకు రైతులకు బీమా సదుపాయం.