: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. శ్రీజయనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ‘ఆస్థానం’ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు.
అంతకు ముందు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారికి తిరుమంజనం నిర్వహించారు. సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను విశేష తిరు ఆభరణాలతో అలంకరించారు. జీయంగార్లు ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి మూల మూర్తికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని, తిరువీధులను పచ్చని పందిళ్లు, రంగవల్లులు, రకరకాల పుష్పాలతో నయనానందకరంగా ముస్తాబు చేశారు. తెలుగు సంవత్సరాది కావడంతో ఇవాళ తిరుమలేశుని ఆశీస్సుల కోసం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేశారు.