: ఇంతకీ కోడెల ఓటు ఎవరికి వేశారు?...ఆసక్తికర చర్చ!
నర్సరావుపేట రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని 29వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఆయన ఎవరికి ఓటు వేశారనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కారణం అక్కడ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మాత్రమే పోటీలో ఉన్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య అవగాహనతో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది టీడీపీ.
బీజేపీ అభ్యర్థి రాచకొండ ప్రసాద్ దాఖలు చేసిన నామినేషన్ విచారణలో తిరస్కరణకు గురైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నల్ల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మాడిశెట్టి మోహన్ రావు మాత్రమే బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో కోడెల ఎవరికి ఓటు వేశారోననే చర్చ నర్సరావుపేటలో జోరుగా సాగుతోంది.