: లాయర్ కాదు.. లయర్..!
అతనో లాయర్ నని చెప్పుకుంటాడు! ప్రపంచస్థాయి ప్రముఖులు తన క్లైంట్లని డాంబికాలు పలుకుతాడు! కేసులు పట్టేందుకు ఎంత అబద్ధమైనా చెప్పేందుకు వెనుకాడడు. పాపం, కథ అడ్డం తిరగడంతో దొరికిపోయాడు. ఈ నయవంచకుడి పేరు గియోవని డి స్టెఫానీ. ఇతనో ఇటలీ జాతీయుడు. ప్రాక్టీసు (?) చేసేది ఇంగ్లండ్ లో. గతంలో ఓ ఫుట్ బాల్ క్లబ్ కు డైరక్టర్ గా కొలువు వెలగబెట్టిన ఈ వంచకుడు.. కక్షిదారులను ఆకర్షించడం కోసం ఎలా మాటల గారడీ చేస్తాడో ఓసారి చూడండి.
ఎలాంటి అర్హతల్లేకపోయినా.. తాను ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ న్యాయ బృందంలో సభ్యుడినంటాడు. ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన వరుస హత్యల నేరస్తుడు డా. హెరాల్డ్ షిప్ మన్ కు వ్యక్తిగత లాయర్ నని చెబుతాడు. అంతేనా, అంతర్జాతీయ న్యాయస్థానంలో సెర్బియా యుద్ధ నేరగాడు స్లొబోదాన్ మిలోసెవిక్ కేసు వాదిస్తోంది తానే అని ఢంకా బజాయిస్తాడు.
పైగా, జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, అల్ ఖైదా వ్యవస్థాపక అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్ తనకు తెలిసినవాళ్ళే అని గప్పాలు కొడతాడు. ఈ విధంగా చెప్పి అమాయకుల వద్ద నుంచి మిలియన్ల కొద్దీ పౌండ్లు నొక్కేశాడు. కానీ, పాపం పండడంతో జైలు పాలవక తప్పలేదు. మొత్తం 25 అభియోగాలు మోపిన ఇంగ్లండ్ పోలీసులు, కోర్టులో అన్నింటిని నిరూపించగలిగారు. దీంతో, లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు ఈ మహా మాయగాడికి 14 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.