: ఇది పెద్ద కుంభకోణం... దాని కథకమామీషు ఇదే!
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని సీఐడీ అధికారులు నిర్థారించారు. ఈ మేరకు కుంభకోణం జరిగిన వైనాన్ని సీఐడీ అధికారి కృష్ణప్రసాద్ వివరించారు. దాని పూర్వాపరాలు ఇవే... ఈ నెల జరిగిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన నివేదిక తెప్పించుకుని, సీఐడీని నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా ఆదేశించారు.
దీంతో రంగం లోకి దిగిన సీఐడీ అధికారులు బృందాలుగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల్లో దీని మూలాలను నిగ్గదీశారు. దీంతో నిజానిజాలు వచ్చాయి. ఈ కుంభకోణంలో 12 మంది బ్రోకర్లతో 25 మంది విద్యార్థులకు ఉన్న సంబంధాలతో పాటు, సుమారు 75 కోట్ల విలువైన లావాదేవీలను సీఐడీ అధికారులు బయటకు తీశారు. దీనికి అనుగుణంగా అమీర్ పేటలో 2006లో కడప జిల్లా రాయచోటికి చెందిన మునీశ్వర్ రెడ్డి 'వర్క్ టెక్' అనే కన్సల్టెన్సీ నడిపేవాడు.
ఇతను మెడికల్ ర్యాంకు రాని విద్యార్థులను మేనేజ్ మెంట్ కోటా సీట్లలో జాయిన్ చేసి విద్యార్థుల వద్దనుంచి కొంత మొత్తాన్ని పుచ్చుకునేవాడు. కాలక్రమంలో ఇలాంటి బ్రోకర్లంతా కలిసి సిండికేట్ గా ఏర్పడ్డారు. మేనేజ్ మెంట్ కోటా సీట్లకు రేటు నిర్ణయించడం, విద్యార్థులను కలిసి కాలేజీల్లో చేర్చడం వీరి దందాగా మారింది. కాలక్రమంలో ఆ సీట్లకు వీరే రేట్ నిర్ణయించడం మొదలు పెట్టారు. తరువాత ఈ సిండికేట్ పీజీ పరీక్ష పత్రాలను సంపాదించడం, వాటిని విద్యార్థులకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి అలవాటు పడ్డారు.
తాజా కుంభకోణం జరిగిన విధానం... పరీక్ష పత్రాలను సంపాదించి, విద్యార్థులను కోచింగ్ పేరిట బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఉంచారు. వారికి భోజనం అన్ని సదుపాయాలు కల్పించి పరీక్ష పేపర్ వారికి ఇచ్చి బట్టీపట్టించారు. అలా నాలుగు రోజులపాటు ఐదేసి గంటల చొప్పున చేయించారు. దీంతో వారికి పేపర్ బట్టీ వచ్చేసింది. తర్వాత వారిని విమానాల్లో హైదరాబాద్ రప్పించి పరీక్ష రాయించారు. దీంతో వారికి టాప్ 100 ర్యాంకుల్లో, 40 ర్యాంకులు వచ్చాయి. రేడియాలజీలో సీటు కోసం కోటీ 20 లక్షల రూపాయలు వసూలు చేశారు.
ఇందుకోసం విద్యార్థుల దగ్గర్నుంచి బ్లాంక్ చెక్కులు, ఒరిజినల్ సర్టిఫికేట్లు ముందుగానే తీసుకున్నారు. కొన్ని బ్యాంకుల్లో డబ్బు డ్రా కావడాన్ని కూడా సీఐడీ పోలీసులు గుర్తించడం విశేషం. బెంగళూరులో, ముంబైలో బ్రాంచీలు ఏర్పాటు చేసి వాటిల్లో ఈ దందా కొనసాగేలా చూశారు. ఈ కుంభకోణానికి పాల్పడ్డ మునీశ్వర్ రెడ్డి ఇందుకోసం నాలుగు సిమ్ కార్డులు వినియోగించాడు. ఇతనితో పాటు కరీంనగర్ కు చెందిన సాయినాథ్ కూడా బ్రోకర్. ఇప్పటికే వీరిని అరెస్ట్ చేశారు. మరో పది మందిని అరెస్టు చేయాల్సి ఉంది.
పీజీ మెడికల్ ర్యాంకర్లలో ర్యాంకు 2, 3, 12, 16, 25, 28, 45 ర్యాంకుల విద్యార్థులు పట్టుబడ్డారు. మరింతమంది పట్టుబడాల్సి ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. మరింత మంది బ్రోకర్లను కూడా అరెస్టు చేయాల్సి ఉన్నందున ఇంతపెద్ద కుంభకోణంలో మరిన్ని నిజాలు వెలుగు చూడనున్నాయి.