: ఆ ఇద్దరు ఓటర్ల కోసం ఓ పోలింగ్ కేంద్రం!
ఇద్దరంటే ఇద్దరు ఓటర్లు.. వారు ఓటు వేసేందుకని ఆరుగురు పోలింగ్ సిబ్బంది. కొండ కోనలపై ఉండే పోలింగ్ కేంద్రాలు... అక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవులను దాటాలి. ఇలాంటి పోలింగ్ కేంద్రాలు అసలుంటాయా? అని అనుమానం కలుగుతోందా? కానీ మనదేశంలో సూర్యుడి తొలి అరుణకిరణాలు తాకే అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి పోలింగ్ బూత్ ఒకటుంది.
అంజా జిల్లాలో హేయులియాంగ్ డివిజన్ లోని మాలోగావ్ అనే ఊరిలో ఒక పోలింగ్ కేంద్రం ఉంది. ఆ ఊరి మొత్తానికి ఉండేది ఒకే కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరే. వారి కోసమే ఆ పోలింగ్ బూత్ ఏర్పాటైంది. అదొక్కటే కాదు... అలా పది మంది కన్నా తక్కువ ఓటున్న పోలింగ్ కేంద్రాలు అరుణాఛల్ ప్రదేశ్ లో పది వరకూ ఉంటాయి. ఇంకో ఇరవై పోలింగ్ కేంద్రాల్లో కేవలం 20 ఓట్లే ఉన్నాయి. ఇక, యాభై మంది వరకూ ఓటర్లున్న బూత్ లు 105 వరకూ ఉన్నాయి.