: బెడ్ లు చాలడం లేదని రోగులను చంపిన డాక్టర్
బ్రెజిల్ లో ఓ డాక్టర్ తన వృత్తికే మచ్చ తెచ్చేలా, మానవత్వాన్ని మరచి, రోగుల ప్రాణాలను నిర్దయగా హరించిన వైనం విస్తుగొలుపుతోంది. బ్రెజిల్ లోని కురిటిబా నగరంలో ఇవాంజెలికల్ ఆసుపత్రిలో వర్జీనియా సోరెస్ డిసౌజా అనే డాక్టర్.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురు పేషెంట్లను అన్యాయంగా చంపివేసింది. తొలుత వారికి కండరాలు వదులయ్యేందుకని బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారు.
అనంతరం వారికి ప్రాణవాయువు సరఫరా తగ్గించారట. దీంతో, శ్వాస అందక ఉక్కిరిబిక్కిరైన ఆ రోగులు కాసేపటికే విగతజీవులయ్యారు. ఐసీయూ కిక్కిరిసిపోవడంతో మరికొందరు పేషెంట్లకు చోటు కల్పించేందుకే.. ఈ ఏడుగురిని చంపిందంటున్న పోలీసులు ఈమేరకు అభియోగాలు నమోదు చేశారు. గత నెలలో డా. వర్జీనియాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెతో పాటు ఐసీయూ విధులు నిర్వర్తించే మరికొందరు సిబ్బందిని సైతం ఈ ఘటనలో నిందితులుగా చేర్చారు.
ఇక, బ్రెజిల్ ఆరోగ్య శాఖ దర్యాప్తు బృందాలు ఆసుపత్రిలో నమోదైన మరణాల రికార్డులను పరిశీలించే పనిలో పడ్డారట. ఈ విధంగా 300కి పైగా చావులు ఐసీయూలో చోటు చేసుకున్నట్టు వారు గుర్తించినట్టు తెలుస్తోంది.