: కాకులకు ఆ తెలివితేటలు నిజంగానే వున్నాయి?
ఎండకు దాహంతో ఒక కాకి గొంతు తడారిపోయింది. అప్పడు దానికొక నీటి కుండ కనిపించింది. కానీ, అడుగున ఉన్న నీరు నోటికి అందడం లేదు. వెంటనే దాని బుర్రలో ఒక ఐడియా మెదిలింది. ఓక్కో రాయిని నోటితో తీసుకొచ్చి కుండలో వేయగా... కొంత కష్టం తర్వాత ఆ కుండలోని నీరు పైకి రావడం అది దాహం తీర్చుకోవడం గురించి ప్రాథమిక తరగతుల్లో ఒక పాఠం చదువుకునే ఉంటారు. కాకులకు అంత తెలివి ఉందా? అన్న సందేహం కొందరికి వచ్చే ఉంటుంది. కానీ, కాకులకు అంత తెలివి నిజంగానే ఉందని తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా నిరూపించారు.
ఏడేళ్ల వయసుగల చిన్నారులకు ఉండే స్థాయిలో కాకులకు తెలివి ఉంటుందని వెల్లడైంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆరు అడవి కాకులకు కొన్ని రకాల పరీక్షలు పెట్టారు. అందులో పైన చెప్పుకున్నది కూడా ఉంది. కాకి తల పట్టలేని ఓ సన్నని కంటెయినర్ లో నీరు పోశారు. ఆ నీరు లోతులో ఉండేట్లు చూశారు. కాకులు నిజంగానే తమ బుర్రను ఉపయోగించి రాళ్లతో ఆ నీరు పైకి రప్పించి దాహం తీర్చుకున్నాయి. అంటే ఇక్కడ ఏ రాళ్లు నీటిలో మునుగుతాయి? ఏవి మునగవు? అన్న విషయం కాకులకు తెలుసని నిరూపితమైంది. 'ప్లాస్ వన్' పత్రికలో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ కు చెందిన సరాజెల్ బర్ట్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.