: పోస్టాఫీసుల ఆధునికీకరణకు రూ. 4700 కోట్లు
దేశంలోని పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. మొత్తం 1.55 లక్షల తపాలా కార్యాలయాలను రూ. 4700 కోట్లతో ఆధునికీకరించాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ కు ఎంపికైన పరవాడ గ్రామాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఈరోజు శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, ప్రతి పోస్టాఫీసులోనూ ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు.
అందుకు భారీగా నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. ఇక జిల్లాలో రాజీవ్ ఐసీటీ సేవల పరిధి పెంచనున్నట్టు చెప్పారు. 220 పాఠశాలల్లో రూ. 24 కోట్లతో ఈ సేవలు విస్తరిస్తామని ఆమె వివరించారు. అంతేగాకుండా జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఐటీ సంస్థ కోసం రూ. 50 కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు.