: జ్యుడీషియల్ కస్టడీలోనే సహారా అధినేత సుబ్రతారాయ్
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. 10 వేల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేయలేమని సహారా గ్రూప్ తెలియజేయడంతో ఆయన కస్టడీలోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుబ్రతాతో పాటు సహారా గ్రూప్ ఇద్దరు డైరెక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సహారా గ్రూప్ ను సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.
‘సుప్రీం’ తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే తాత్కాలిక బెయిలును మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి 25 వేల కోట్ల రూపాయల సమీకరణ... సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం... ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం... తెలిసిందే. ఈ నేపథ్యంలో సెబీ, కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచి రాయ్, ఇరువురు డైరెక్టర్లు రవిశంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.