: ఏడు టన్నుల పూలతో ఏడుకొండల స్వామికి పుష్పయాగం
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా జరిగే పుష్పయాగం సందర్భంగా ఏడు టన్నుల పుష్పాలను స్వామివారికి నివేదించారు. బుధవారం నాడు జరిగిన ఈ విశిష్ఠ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు తరించారు. ఆలయంలోని ఉత్సవ మూర్తులకు పుష్పస్నానం చేయించారు. మల్లెపూలు, గులాబీ, మొగలి, కలువ, సన్నజాజి, విరజాజి తదితర పువ్వులతో కూడిన ఈ యాగం ఆద్యంతం శోభాయమానంగా సాగి... భక్తులను కనువిందు చేసింది.
శాస్త్రరీత్యా భూకంపాలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి భూమిని కాపాడేందుకు ఈ పుష్పయాగ పర్వదినాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. మానవ జాతిని, సకల జీవ, జంతుజాతులను ప్రకృతి ఉపద్రవాల నుంచి బయటపడేయాలంటూ శ్రీవారిని ఈ సందర్భంగా వేడుకొంటారు. ఈ యాగానికి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో భాస్కర్, డిప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈవో ధనుంజయులు తదితరులు హాజరయ్యారు.