: ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం సంచలనాత్మక ఆదేశాలు
ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంపై నేడు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేగాకుండా, ఎన్.శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే, గవాస్కర్ కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది.
ఐపీఎల్ గత అంచె పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ కు ఫిక్సింగ్ లో భాగముందని సుప్రీం నియమించిన జస్టిస్ ముద్గల్ కమిటీ తేల్చింది. గురునాథ్ సాక్షాత్తు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు. తన అల్లుడి కోసం శ్రీనివాసన్ నిబంధనలు పక్కనబెట్టారన్న ఆరోపణలున్నాయి. అంతేగాకుండా, చెన్నై జట్టు సారథి ధోనికి ఫిక్సింగ్ రహస్యాలు తెలుసని, అయినా, అతడు బయటపెట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు టోర్నీ జరుగుతున్న దశలోనే కటకటాల వెనక్కి చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు జట్లపై సుప్రీం కొరడా ఝుళిపించినట్టు తెలుస్తోంది.