: రైల్వే కోర్టుకు హాజరైన కవిత, కోదండరామ్
తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన రైల్ రోకో కేసులను ఎదుర్కొంటున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం వారి వాంగ్మూలాన్ని తీసుకుని విచారణను వాయిదా వేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులు కోర్టులు చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ విమర్శలపై మాట్లాడుతూ ఆయన వేరే వారు రాసిచ్చిన స్క్రిప్టును మాత్రమే చదివారని ఎద్దేవా చేశారు.