: దేశంలో పెద్ద తలకాయలు పోటీ చేసే స్థానాలివే


మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కీలకమైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. రెండు పార్టీలు ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో ప్రధాన అభ్యర్థుల వివరాలివే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. 2004 నుంచి ఆమె రాయ్ బరేలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది ఆమెకు కంచుకోట. ఇక్కడ ఎన్నికల ప్రచారానికి రాహుల్, ప్రియాంక సిద్ధమవుతున్నారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, గుజరాత్ లోని వడోదర రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీకి ఇప్పటి వరకు ఎదురులేదు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుంచి బరిలో నిలుస్తున్నారు. అమేథి కాంగ్రెస్ కు తిరుగులేని స్థానం.

బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. వాజ్ పేయి ఇక్కడి నుంచే అఖండ విజయాన్ని అందుకున్నారు. లక్నో ప్రజలు వాజ్ పేయి లాగే రాజ్ నాథ్ ను ఆదరిస్తారని బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రి కమల్ నాథ్ మద్యప్రదేశ్ లోని చింద్ వారా నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.

బీజేపీ లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మధ్యప్రదేశ్ లోని విదిశ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఆధార్ ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నిలేకని కాంగ్రెస్ పార్టీ తరపున బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. గత ఐదు సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ తిరుగులేని విజయం సాధించాడు.

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి బరిలో దిగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సిద్దూపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి బరిలో నిలుస్తున్నారు. శతృఘ్నసిన్హా బీహార్ లోని పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు.

ప్రముఖ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ ఢిల్లీలోని చాందినీచౌక్ నుంచి బరిలో నిలబడుతున్నారు. గత రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ గెలుపొందారు.

  • Loading...

More Telugu News