: ఫ్రెంచివారు వైన్ తాగడం తగ్గించారు.. ఎందుకనగా..
ప్రపంచంలో ఫ్రెంచి వైన్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు కొందరు దేశాధినేతలకు కూడా ఉండవేమో! ఎంత ఎక్కువకాలం నిల్వ చేస్తే అంత రుచి.. అదీ ఫ్రెంచి వైను విశిష్టత. నాణ్యమైన ద్రాక్ష రసంతో తయారు చేసే ఈ వరల్డ్ ఫేమస్ పానీయం, ప్రపంచ మద్యం ప్రియులందరికీ నచ్చే, మెచ్చే సారాయం. అయితే, ఈ పులపుల్లని మద్యానికి పుట్టిల్లని చెప్పదగిన ఫ్రాన్స్ లో వైన్ తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందట.
ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న అక్కడి సంప్రదాయవాదులు, సాంస్కృతిక పరిరక్షకులను తీవ్రంగా వేధిస్తోందట. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ అధ్యయనం వీరికి జవాబిస్తోంది. 1980 ప్రాంతాల్లో పెద్దవాళ్ళలో సగం మంది రోజూ వైన్ స్వీకరించేవారట.
ప్రస్తుతం అది 17 శాతానికి పడిపోయింది. అదే సమయంలో అసలు మందు ముట్టనివాళ్ళ సంఖ్య రెట్టింపయిందని తెలుస్తోంది. 1965లో తలసరి ఒక్కింటికి వైన్ వినియోగం 160 లీటర్లు ఉండగా.. 2010 వచ్చేసరికి అది 57 లీటర్లకు పడిపోయిందని అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రస్తుతం 60-70వ పడిలో ఉన్నవాళ్ళు ప్రతి రోజూ వైన్ తీసుకునేవారట.
40-50వ పడిలో ఉన్నవాళ్ళు సందర్భానుసారం మద్యం స్వీకరించేవాళ్ళట. యువతరం విషయానికొచ్చేసరికి వారు ఇంటర్ నెట్ యుగంలో దూసుకెళుతున్నవారాయె. దీంతో, వారు వైన్ ను పెద్దగా పట్టించుకోవడంలేదట. ఎంతసేపూ కంప్యూటర్ వినియోగంలో మునిగితేలుతున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ వెల్లడిస్తోంది. అదండీ, ఫ్రెంచి గడ్డపై వైన్ వినియోగం తగ్గడానికి కారణం.