: మంగుళూరు పబ్ ఘటనను మర్చిపోయారు: ప్రమోద్ ముతాలిక్
2009లో మంగుళూరులోని ఓ పబ్ లో మహిళలపై శ్రీరామ్ సేన దాడి చేయడంతో ప్రమోద్ ముతాలిక్ వార్తల్లోకెక్కారు. అయితే, మంగుళూరు పబ్ ఘటనను ప్రజలు మర్చిపోయారని, ఆ సంఘటన దురదృష్టకరమని వివాదాస్పద శ్రీరామ్ సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. తనకు ఇచ్చిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
బీజేపీ తనను అవమానించిందని, ఇటువంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సందేశాలు పంపే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమోద్ ముతాలిక్ ను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు... విపక్షంతో పాటు, స్వపక్షం నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని ఆయనను బయటకు పంపేసిన సంగతి తెలిసిందే.