: సచిన్.. ఆడింది చాలు, ఇక తప్పుకో: ఇది కపిల్ మాట
గతమెంతో ఘనమైనా, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు చెబితేనే మంచిదని మహోన్నత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సలహా ఇస్తున్నాడు. ఆటకు గుడ్ బై చెప్పిన తరువాత సచిన్ క్రికెట్ కు ఓ మంచి రాయబారిగా వెలుగొందుతాడని కపిల్ అన్నాడు.
సచిన్ కెరీర్లో కీలక దశ ముగిసిందని, ప్రస్తుతం అతని క్రీడా జీవితం చరమాంకంలో ఉందని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఇక, సచిన్ వరుసగా మూడు సెంచరీలు బాదినా తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు ఉండదని ఈ హర్యానా హరికేన్ అంటున్నాడు. సచిన్ ఇంకెంతమాత్రం యువ ఆటగాళ్ళకు అడ్డంకిగా పరిణమించరాదని ఆయన సూచించాడు.
ఈ విషయాన్ని ఒక్క సచిన్ ను దృష్టిలో పెట్టుకునే చెప్పడంలేదని, సమాజంలో కూడా యువత పురోభివృద్ధికి ఎవరూ అడ్డునిలవరాదన్న ఉద్ధేశంతో ఈ సలహాను ఇచ్చానని కపిల్ చెప్పుకొచ్చారు. గంగూలీ, కుంబ్లే, ద్రావిడ్ తరహాలో సచిన్ కూడా క్రికెట్ రాయబారిగా పేరు తెచ్చుకుంటాడని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.