: అడ్వర్టైజ్ మెంటులో అశ్లీలం.. ఉద్యోగులపై వేటు
ఓ వాణిజ్య ప్రకటనలో ఇష్టారాజ్యంగా అశ్లీలాన్ని గుప్పించిన కొందరు ఉద్యోగులకు డబ్ల్యూపీపీ అడ్వర్టైజింగ్ ఏజన్సీ ఉద్వాసన పలికింది. విషయం ఏంటంటే, ఫోర్డ్ కంపెనీ కొత్త ఫిగో వెర్షన్ కు వాణిజ్య ప్రకటన రూపొందించే బాధ్యతను డబ్ల్యూపీపీ సంస్థకు అప్పగించకున్నా.. ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు తమదైన శైలిలో ఫోర్డ్ వాణిజ్య ప్రకటనను సృజించారు.
మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని డ్రైవర్ సీట్లో ఉండగా... కారు వెనుక భాగంలో అర్థనగ్నంగా ముగ్గురు ముద్దుగుమ్మలు తాళ్ళతో బందీలై ఉంటారు. సిల్వియో వారిని చూస్తూ విక్టరీ సింబల్ చూపుతుంటారు. మరో పోస్టర్లో వరల్డ్ సెలెబ్రిటీ పారిస్ హిల్టన్ డ్రైవర్ సీట్లో ఆసీనురాలై ఉండగా.. టీవీ షో స్పెషలిస్టులు కర్డాషియన్ సోదరీమణులు కారు వెనుకవైపు తాళ్లతో బందీలై ఉంటారట.
ఈ పోస్టర్లో 'మీ చింతలన్నీ ఫిగో ఎక్స్ ట్రా లార్జ్ బూట్ వెనుక వదిలేయండి' అన్న ట్యాగ్ లైన్ కూడా ఉందట. సరిగ్గా ఈ పోస్టర్లు ప్రచురణకు నోచుకున్న సమయంలో భారత్ లో అత్యాచారాలపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఉద్రిక్త సమయంలో ఈ పోస్టర్లు విడుదలవడంతో కంగుతిన్న డబ్ల్యూపీపీ వెంటనే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది.
వెంటనే, సదరు 'సృజనాత్మక' ఉద్యోగులను ఇంటికి పంపింది. 'వృత్తి పరమైన ప్రమాణాలకు ఈ పోస్టర్లు విరుద్ధంగా ఉన్నందుకు మేం చింతిస్తున్నాం' అని ఆ ప్రపంచస్థాయి సంస్థ పేర్కొంది. ఫోర్డ్ సంస్థ ఎన్నడూ ఇలాంటి వాణిజ్య ప్రకటన కోరలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఉదంతం పట్ల తాను కూడా బాధపడుతున్నట్టు ఫోర్డ్ సంస్థ తెలిపింది. అయితే, డబ్ల్యూపీపీ యాడ్ ఏజెన్సీపై చర్యలు తీసుకునే విషయమై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.