: ఆదిలాబాద్ జిల్లాలో రూ. 1.49 కోట్లు స్వాధీనం
ఎన్నికల సందర్భంగా ఈ నెల మొదటి వారంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 1,49,73,640 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్న వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నగదుతో పాటు ఇప్పటివరకు మూడు కిలోల వెండి పట్టుబడింది.
ఎక్సైజ్ శాఖ అధికారులు 29,924 లీటర్ల లిక్కరును స్వాధీనం చేసుకున్నారు. వెయ్యి వరకు ప్రొహిబిషన్ కేసులు నమోదు చేసి, అందుకు బాధ్యులైన 145 మందిని అరెస్ట్ చేశారు. 491 బెల్ట్ షాపులను మూసివేశారు. జిల్లాపరిధిలోని పది నియోజకవర్గాల్లో 52 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.