: మలేషియా విమానం అలా పడిపోయిందా?
16 రోజుల క్రితం అదృశ్యమైన మలేషియా విమానంపై రోజుకో కథనం వెలుగులోకి వస్తోంది. విమానం హైజాక్ అవ్వడం, లేదా దారిమళ్లించడం జరగలేదని, సాంకేతిక లోపం కారణంగానే సముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు. గత 16 రోజులుగా వివిధ దేశాల్లోని వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ చైనా సముద్రం మీదుగా విమానం మలుపు తీసుకుందని, ఆ తరువాతే అది బాగా కిందకు వెళ్లిపోయిందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా తెలుస్తోంది. రాడార్ పరిధి నుంచి విమానం అదృశ్యం కావడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని తెలిపారు. ఆ మలుపు తీసుకునేందుకు రెండు నిమిషాల సమయం పట్టిందని, అలా మలుపు తీసుకుంటున్నప్పుడే ప్రమాదం సంభవించి ఉంటుందని, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉంటారని, అయితే అప్పటికే కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలమవడంతో సంకేతాలు అందకపోయి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విమానం మలుపు తీసుకున్న ప్రదేశంలో విమాన ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని, ఆ కారణంగానే అక్కడ విమానం తక్కువ ఎత్తులో ప్రయాణించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారు క్రోడీకరించిన సమాచారం మేరకు చివరి సంకేతం వివరాల ప్రకారం విమానం బీజింగ్ వెళ్తోందని మలేషియా అధికారులు వెల్లడించారు. దీంతో విమానం హైజాక్, లేక దారి మళ్లించడం జరగలేదని నిర్ధారించారు. విమానం తప్పిపోయిన రోజు తెల్లవారుజాము 1.19 నుంచి 2.40 మధ్య మిలటరీ రాడార్ ట్రాక్ చేస్తూనే ఉందని, అయితే 12 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తుకు ఎప్పుడు దిగిపోయిందో తెలియదని చెబుతున్నారు.