: గేల్ Vs టీమిండియా
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై నెగ్గి శుభారంభం చేసిన టీమిండియా రేపు డిఫెండింగ్ చాంప్ వెస్టిండీస్ తో తలపడనుంది. ఢాకాలో జరిగే ఈ మ్యాచ్ పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొంత విరామం తర్వాత జట్టులోకొచ్చిన విధ్వంసక శక్తి క్రిస్ గేల్ తన జోరు ప్రదర్శించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత బౌలర్లకు గేల్ కు మధ్య ఆసక్తికర సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సెంచరీ సాధించగల దమ్ము తనకుందని ఇటీవలే గేల్ అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.
కాగా, పాక్ తో మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన ధోనీ ఆదివారం నాటి మ్యాచ్ కూ ఇదే ఎత్తుగడ అవలంభిస్తాడనడంలో సందేహంలేదు. ఎందుకంటే, విండీస్ జట్టులో స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొనే ఆటగాళ్ళు తక్కువ. ప్రధానంగా గేల్ తక్కువ ఫుట్ వర్క్ తో బంతిని బలంగా బాదడంపైనే దృష్టి పెడతాడు. దూకుడుగా ఆడే ఆటగాళ్ళకు రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి సఫలమైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ గేల్ పైనా ఇదే టెక్నిక్ కు కట్టుబడే అవకాశముంది. ఇక, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఫ్లైటెడ్ డెలివరీలు కూడా గేల్ అండ్ గ్యాంగ్ కు పరీక్ష పెట్టనున్నాయి.