: ఆ విమానం జల సమాధే?... చరిత్రలో మిస్టరీ!


239 మంది ప్రయాణికులతో మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతూ అదృశ్యమై 15 రోజులవుతోంది. 25 దేశాలు పదుల సంఖ్యలో ఓడలు, హెలికాప్టర్లు, యద్ధ విమానాలతో తీవ్రంగా అన్వేషించినా విమానం ఆచూకీ తెలియరాలేదు. దక్షిణ హిందూ మహాసముద్రంలో నీటిపై రెండు శకలాలు తేలుతున్నట్లు తమ శాటిలైట్ చిత్రాల్లో కనిపించిందని ఆస్ట్రేలియా ప్రకటించగా.. కొత్త ఆశలు మొలకెత్తాయి. కానీ, చివరికి అవి కూడా ఆచూకీ లేకుండా పోవడంతో... ఇక ఆ విమానం జలసమాధి అయి ఉంటుందని.. సాగరంలో అడుగు భాగానికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

విమానం వేగంగా నీటిలోకి దూసుకుపోవడంతో.. డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కనుక... శవాలు కూడా బయటపడి పైకి తేలడానికి అవకాశం లేదని అంచనా. విమానాన్ని హైజాక్ చేసి ఎక్కడో రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఉంటారనే కథనాలు వినిపించాయి. కానీ, ఎక్కడకు తీసుకెళ్లినా... హైజాకర్లకు ఒక లక్ష్యం ఉంటుంది. వారికంటూ డిమాండ్లు ఉంటాయి. అవేమీ లేని పరిస్థితుల్లో హైజాక్ వార్తలకు తర్కబద్ధత ఉండదు. విమానం దాదాపుగా జలసమాధే అయి ఉంటుందని చెప్పడానికి చరిత్రలో మరో రెండు ఘటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు. 1953లో బ్రిటన్ విమానం 39 మందితో లండన్ నుంచి జమైకా వెళుతూ అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో అదృశ్యమైంది. అలాగే 1965లో అర్జెంటీనా సైనిక విమానం 69 మందితో వెళుతూ కనిపించకుండాపోయింది. ఇంతవరకూ వీటి జాడ తెలియరాలేదు. తాజా విమానం కూడా చరిత్రలో మిస్టరీలా వీటి సరసన చేరనుందేమో!

  • Loading...

More Telugu News