: చిరంజీవి గొప్ప నటుడే... కానీ, హాస్యనటుడిలా మాట్లాడుతున్నారు: కిరణ్


తెలుగు జాతి భవిష్యత్తు కోసమే తాను పార్టీ పెట్టానని జైసమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలు బాధపడేలా రాష్ట్ర విభజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేయడానికి అనుసరించిన విధానం సరైంది కాదని తెలిపారు. చంద్రబాబు విభజనకు అనుకూలమా?, లేక వ్యతిరేకమా? అనే విషయం అర్థం కావడంలేదని అన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని చెప్పారు. ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి గొప్ప నటుడే కావొచ్చు... కానీ, ఇప్పుడు హాస్య నటుడిలా మాట్లాడుతున్నారని కిరణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు తానే కారణమని కొందరు నేతలు ఆరోపిస్తున్నారని... అది వారి రాజకీయ పరిజ్ఞానాన్ని సూచిస్తుందని కిరణ్ వ్యాఖ్యానించారు. విభజనకు సంబంధించి తన వైఖరిని సోనియాగాంధీకి స్పష్టం చేశానని... కానీ, ఏం చేయబోతున్నారన్న విషయం కేంద్ర ప్రభుత్వం తనకు చెప్పలేదని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించరాదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పానన్నారు. ఎందుకు విభజించరాదో వివరాలతో వెల్లడించానని... కానీ, తన మాటను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర వారి ఐటీ, ఫార్మా కంపెనీలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని... సీమాంధ్ర ప్రాంతం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని... వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం ఉండదని అధిష్ఠానానికి చెప్పానని... అయితే కేసీఆర్, జగన్ ల అండతో ఇరు ప్రాంతాల్లో నెట్టుకురావచ్చని కాంగ్రెస్ భావించిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News