: ప్రజలను గొర్రెలంటాడా?... కేసీఆర్ పై మండిపడ్డ దామోదర


తెలంగాణ ప్రజలను గొర్రెలతో పోలుస్తాడా? దానిని దొరతనం అనకుండా ఇంకేమనాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని చెప్పడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా? అని నిలదీశారు. తెలంగాణలో తోడేళ్లలాంటి నేతలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దురహంకారంతో ప్రజలను ఇలాగే రెచ్చగొడితే కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దామోదర హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రానికి దొర, దొంగ ఇద్దరూ ఒకడేనని, అతను కేసీఆర్ అని దుయ్యబట్టారు. ఒంటేలు, ఏనుగులతో ఊరేగింపు దొరతనానికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. తెలంగాణలో మాట తప్పితే దొంగ అంటారని తెలిపారు. కాంగ్రెస్ లో విలీనం అని, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్ ను దొంగ అనకుండా ఇంకేమనాలని దామోదర కడిగిపడేశారు.

  • Loading...

More Telugu News