: అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు: పవన్
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాల్లో విభేదాలు దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య విభేదాల వల్ల యువతలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలపై మోడీతో చర్చించానని చెప్పారు. విభజించిన తీరు సరిగా లేదన్న పవన్ ప్రధాని అభ్యర్థిగా మోడీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
మోడీ ప్రధాని అవుతారన్న విశ్వాసం తనకు ఉందని, తెలుగు ప్రజలందరి తరపున మోడీకి మద్దతు తెలిపేందుకు ఇక్కడకు (అహ్మదాబాద్) వచ్చానన్నారు. దేశానికి ఆయన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలమధ్య సమైక్యత ఎందుకు తేలేకపోయారని సమావేశంలో మోడీ అడిగారని చెప్పిన పవన్, సూరత్ లో తెలుగువాళ్లు ఐక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేరని కూడా అడిగినట్లు తెలిపారు.