: ఐటీ రాజధానిలో దారుణం
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే రేస్ కోర్సు పరిసరాల్లో నడిరోడ్డు మీద ఒక వ్యక్తి వివాహితను దారుణంగా పొడిచి చంపేశాడు. మాగడి రోడ్డులోని తావరకెరె సమీపంలోని కెంపేగౌడ నగరలో నివాసముంటున్న సునీత రేస్ కోర్సు రోడ్డులోని ఓ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోంది. మధ్యాహ్నం షిఫ్టుకు వెళ్తున్న సునీత విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ రేస్ కోర్సు ప్రాంతానికి వచ్చింది.
గేట్ నెంబర్ 3 వద్దనున్న ఫుట్ పాత్ పై నడుస్తుండగా ఆమె స్నేహితుడు ధనరాజ్ వచ్చి ఆమెను అడ్డుకున్నాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆమె పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది. దీంతో రోడ్డుపై నడుస్తున్నవారు, రేస్ కోర్సులో గుర్రప్పందాలు చూసేందుకు వచ్చినవారు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుప్రతికి తరలించారు.
ఇంతలో ధనరాజ్ తప్పించుకునేందుకు చూడడంతో అతడ్ని పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి చేరుకునే సరికే తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత మృతి చెందింది. ఆమెను అత్యంత పాశవికంగా 17 సార్లు కత్తితో పొడిచాడని వైద్యులు తెలిపారు. కాగా ఆమె భర్త ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, వారికి ఒక మానసిక వికలాంగురాలైన కుమార్తె ఉంది.
సునీత, ధనరాజ్ ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఆరేళ్లుగా పరిచయం ఉంది. ధనరాజ్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతనికి దూరంగా ఉంటోంది. దీంతో సునీతతో మాట్లాడేందుకు వచ్చిన ధనరాజ్ ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు.