: అదొక కీకారణ్యం... ఒకే ఒక్కడు...అతని కోసం ఐదుగురు సిబ్బంది!
గుజరాత్ లో అదొక అడవి. అది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. అక్కడ సింహాలతో సహా వణ్యప్రాణులన్నీ ఉన్నాయి. ఆ కీకారణ్యంలో ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ ప్రాంతానికి బనేజ్ అని పేరు. ఆ గుడికి మహంత్ దర్శన్ అనే వ్యక్తి పూజారి. ఆయన నివాసముండేది సప్నేస్ బిల్లియత్ అనే గ్రామంలో. ఆ గ్రామంలో నివాసముండేది ఆయన ఒక్కడే. ఆ పోలింగ్ బూత్ కి ఆయన ఒక్కడే ఓటరు.
మహంత్ దర్శన్ దాస్ కోసం జునాగఢ్ జిల్లాలోని గిర్ సింహాల జాతీయ వన్య పార్కు మధ్యలో సప్నేస్ బిల్లియత్ గ్రామంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఆ ఒక్క వ్యక్తి ఓటు కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, ఒక ప్యూన్, ఒక పోలీసు అడవిలో ప్రయాణించి వచ్చి పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. దర్శన్ దాస్ ఓటేస్తే పోలింగ్ అధికారుల పని పూర్తవుతుంది. సప్నేస్ బిల్లియత్ లో నూటికి నూరు శాతం కానీ లేకుంటే సున్నా శాతం కానీ ఓట్లు పోలవుతాయి.
గతంతో ఇక్కడ 85 మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని విడిచి వేరేచోటికి వెళ్లిపోయారు. ఆలయంలో పూజాధికాలు నిర్వర్తించే పూజారి మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇతని ఓటు కోసం గుజరాత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇలాంటి పోలింగ్ బూత్ లు అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ఉన్నాయి. అక్కడ ఓటర్ల సంఖ్య పది మంది లోపే ఉండడం విశేషం. ఈ గ్రామాల్లో ఓటర్ల కోసం అక్కడి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.