: సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా: నటుడు అంబరీష్
కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీష్ కోలుకుంటున్నారు. మరో వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక బెంగళూరుకు తిరిగి వస్తారు. శ్వాసకోశ వ్యాధితో కొద్ది రోజుల కిందట తీవ్ర అనారోగ్యం పాలయిన అంబరీష్ ప్రస్తుతం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల చికిత్సతో కొంతవరకు కోలుకున్న ఆయన తన ఆరోగ్యం గురించి అభిమానులకు, బంధువులకు, స్నేహితులకు సీడీ రూపంలో ఓ సందేశాన్ని పంపారు. 'అందరికీ మీ అంబరిష్ నమస్కారం. నా ఆరోగ్యం గురించి అభిమానులు, పెద్దలు, దేశ, విదేశాల్లోని నా స్నేహితులు ఆందోళన చెందారు. పూజలు కూడా చేశారు. అయితే, ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో తప్పకుండా తిరిగి వస్తాను. విక్రం ఆసుపత్రి (బెంగళూరు) వైద్యులు చూపిన ప్రేమ, విశ్వాసానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారి ప్రయత్నం వల్లే బతికాను. ప్రభుత్వం నాకు అవసరమైన సాయం అందించింది. సింగపూర్ వైద్యుల సలహా మేరకు ఓ వారం ఇక్కడే ఉంటాను. జైహింద్, జై కర్ణాటక' అని అంబరీష్ తెలిపారు.