: మద్యం మత్తులో ఏఎస్సై వీరంగం.. మూడు నెలల చిన్నారి మృతి
ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పాషా దౌర్జన్యానికి మూడు నెలల నిఖిత అనే చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా దుబ్బాక పీఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న పాషా ఓ భూవివాదాన్ని పరిష్కరించేందుకు నిఖిత తండ్రి కోసం వాళ్ళింటికి వెళ్లాడు. ఆయన ఇంట్లో లేడని నిఖిత తల్లి తెలిపింది. అంతే... అప్పటికే తాగిన మైకంలో ఉన్న పాషా విచక్షణ కోల్పోయి ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారి నిఖిత కింద పడి గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నిఖిత చికిత్స పొందుతూ మరణించింది. పాషా వల్లే తమ చిన్నారి చనిపోయిందని నిఖిత తల్లిదండ్రులు, బంధువులు దుబ్బాక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఎఎస్సై పాషా పరారీలో ఉన్నాడు.