: 21నుంచి 28 వరకు బస్సుయాత్ర:రఘువీరారెడ్డి
ఈ నెల 21 నుంచి 28 వరకు బస్సు యాత్ర చేపడతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన బస్సుయాత్రలో స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని అన్నారు. 21న విజయనగరంలో సింగ్యులర్ ప్రోగ్రాంగా అభ్యర్థుల అభ్యర్థిత్వాలను స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా ఇతర పట్టణాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రచార హోరుతోనో, ఓటమి భయంతోనో, విభజన ప్రభావంతోనో, అవకాశవాదంతోనో, తెలిసో తెలియకో, అగ్రశ్రేణి నాయకులు కాంగ్రెస్ నుంచి ప్రక్కకు పోవడం వల్ల నాయకత్వ లోపం కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రజలకు కానీ, కాంగ్రెస్ అభిమానులకు కానీ కరవు లేదని అన్నారు. జెండా మోసే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారని తెలిపిన రఘువీరారెడ్డి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనకు 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వదిలేసిందని చెప్పారు.
"నన్ను నమ్మి నాకు బాధ్యత అప్పగిస్తే, నేను ఉన్నపళంగా కొత్త పార్టీలోకి వెళ్తే గందరగోళం నెలకొంటుంది" అని అన్నారు. పార్టీ వీడినవారు. వీడాలనుకుంటున్నవారు, వెనక్కి రండి అని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడైతే నేతలు వెనక్కి రారో అక్కడికి కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనాయకత్వం మొత్తం వెళ్లి ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు. యువ నాయకత్వానికి జవసత్వాలు కల్పిస్తామని చెప్పిన ఆయన, వ్యక్తులు తాత్కాలికమని, సంస్థ శాశ్వతమని స్పష్టం చేశారు.
కార్యకర్తల్లో మమేకమై వారిలో విశ్వాసం కల్పించి, నాయకత్వ లోటు తీర్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని రఘువీరా విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వంలో యువకులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. తనను చాలా మంది యువకులు కలుస్తున్నారని ఆయన తెలిపారు.